తెలంగాణ మాజీ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది – కేటీఆర్. ఆయన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ గ్యారంటీలను హామీగా చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై కొత్త పన్నులు, ఛార్జీలు పెంచి భారం మోపుతుందని కేటీఆర్ అన్నారు.

కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ గ్యారంటీలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ గ్యారంటీలు అంటే స్కామ్లకు కొత్త పేరు అని ఎద్దేవా చేశారు. వారి స్కీమ్ల ద్వారా ఓట్లు దండుకొని, తర్వాత ఛార్జీలు, పన్నులు పెంచడం ద్వారా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
Also Read: మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..?
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం RTC బస్సు ఛార్జీలను 15% పెంచిందని, హిమాచల్ ప్రదేశ్‌లో టాయిలెట్ ట్యాక్స్ కూడా విధించిందని కేటీఆర్ ఉదాహరణగా తెలిపారు. ఈ చర్యలు వారి పాలనలో అసలు ప్రజా సంక్షేమం లేని సంకేతాలని ఆయన విమర్శించారు. ఈ విధమైన ఆర్థిక భారం సామాన్య ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల మాయలో పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రజల అభివృద్ధి, సంక్షేమం కేవలం టీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) ప్రభుత్వ హయాంలోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.