ప్రజల ఆదాయంలో ఎలాంటి మార్పులు కనిపించకపోయినా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పు, ఉప్పు, కూరగాయలు, మాంసం వంటి అన్ని నిత్యావసరాలు కొండెక్కాయి. రాష్ట్రంలోని సాధారణ కుటుంబాలకు నెలవారీ ఖర్చులు తలపై భారంగా మారుతున్నాయని తాజా గృహ వినియోగ సర్వే వెల్లడించింది.
ఈ సర్వే ప్రకారం… తెలంగాణలో ప్రతి కుటుంబం నెలకు సగటున రూ.5675 ఖర్చు చేస్తోందని గుర్తించారు. ఇది ఆర్థికంగా మధ్య తరగతి కుటుంబాలకు గణనీయమైన భారం అవుతోంది. నిత్యావసరాల ధరల పెరుగుదల కారణంగా గృహాల నిర్వహణ కష్టసాధ్యమవుతోంది. రాష్ట్రంలోని ప్రజలకి ధరల పెరుగుదల వల్ల జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఈ నెలవారీ వ్యయంలో దేశవ్యాప్తంగా కేరళ మొదటి స్థానంలో నిలవగా, ఆ తరువాత తమిళనాడు, తర్వాత తెలంగాణ నిలిచింది. ప్రధానంగా రేషన్ సరుకుల ధరలపై ఆధారపడే కుటుంబాలకు కూడా నిత్యవసరాల పెరుగుదల తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా కూరగాయలు, పప్పుదినుసులు, నూనె ధరలు పెరగడం కుటుంబ ఖర్చుల పెరుగుదలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం అవసరం అని సామాన్య ప్రజలు కోరుతున్నారు. ధరలు స్థిరీకరించడానికి సబ్సిడీలు, రేషన్ పంపిణీ మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి, ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటే మాత్రమే ప్రజలు కొంత రిలీఫ్ పొందగలరు.
విపరీతంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో కూడా ఖర్చులను నియంత్రించడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ధరల నియంత్రణకై ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే గానీ సమస్యకు పరిష్కారం దొరకదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.