తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 20న దావోస్‌కు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వర్ల్డ్ ఎకనామిక్ ఫోరం) నిర్వహించే వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో సీఎం రేవంత్‌తో పాటు రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా హాజరుకానున్నారు.
తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ను సదస్సులో ఏర్పాటు చేసి రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్యావిలియన్ ద్వారా తెలంగాణకు చెందిన ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, సుస్థిరత అంశాలను ప్రదర్శించనున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దావోస్‌లో పలువురు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, శక్తి, ఆర్థిక, ఆరోగ్య రంగాల ప్రముఖులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణం, ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతుల గురించి వారి ముందుకు వివరాలు ఉంచనున్నారు. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ తన ప్రసంగం ద్వారా తెలంగాణ పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతలు, పెట్టుబడులకు కల్పిస్తున్న మద్దతు గురించి వివరించేలా ఈ ప్రసంగం ఉంటుందని సమాచారం.
ఈ పర్యటన ద్వారా తెలంగాణకు భారీ పెట్టుబడులు రాబట్టేందుకు ప్రభుత్వ ప్రతినిధులు ఆశావహంగా ఉన్నారు. ముఖ్యంగా ఐటీ రంగం, హరిత శక్తి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ పర్యటన దోహదం చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.