సంక్రాంతి పండుగ సందర్బంగా తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు APSRTC ప్రకటించింది. ఈ బస్సులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులపై అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని APSRTC స్పష్టంగా తెలిపింది. సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. బస్సుల్లో ప్రథమంగా సీట్ల భద్రతను కచ్చితంగా పాటిస్తూ ప్రయాణికులకు సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని APSRTC అధికారులు తెలిపారు.
సాధారణంగా MGBS (మహాత్మా గాంధీ బస్సు స్టేషన్) వద్ద సంక్రాంతి సమయంలో తీవ్ర రద్దీ కనిపిస్తుంది. దీనిని తగ్గించేందుకు జనవరి 10 నుంచి 12 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సులను గౌలిగూడలోని CBS (సెంట్రల్ బస్ స్టేషన్) నుంచి నడపనున్నట్లు APSRTC ప్రకటించింది.
ఈ ప్రత్యేక బస్సుల ద్వారా, హైదరాబాద్‌లో పనిచేసే ప్రజలు, విద్యార్థులు తమ సొంత ఊళ్లకు సులభంగా చేరుకునే అవకాశం లభిస్తుంది. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలనుకునే వారి కోసం ఈ ఏర్పాట్లు చేయడం ప్రశంసనీయమని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రత్యేక బస్సుల వివరాలను, టైమ్ టేబుల్‌ను తమ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా అందుబాటులో APSRTC ఉంచింది. ప్రయాణికులు ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకోవడం ద్వారా రద్దీని తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.