వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పలు భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.బాలయ్య డాకా మాహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, ఇంకా విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రధానంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రాలన్నింటి మధ్య, వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా, జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రమోషన్లతో బాగానే వేడి పుట్టిస్తోంది. సినిమాలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు యూట్యూబ్‌లో హిట్స్ కొల్లగొట్టాయి.గోదారి గట్టు మీద రామ సిలకవే.మీనూ వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి.ఇవి ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుండగా,మూడో పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
ప్రత్యేకంగా, మొదటి పాటను రమణ గోగుల పాడడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత రమణ గోగుల ఈ చిత్రంతో తిరిగి తన మాయాజాలాన్ని చూపించారు. రెండో పాట కూడా హిట్ కాగా, తాజా సమాచారం ప్రకారం, మూడో పాటను స్వయంగా హీరో వెంకటేశ్ పాడినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్లలో అనిల్ రావిపూడి తన ప్రత్యేక శైలిని మరోసారి చూపిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫన్నీ వీడియోలో, బ్లాక్ బస్టర్ పొంగల్ అనే పాటను వెంకటేశ్ పాడినట్లు హింట్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి హిట్ ట్రాక్ రికార్డ్,వెంకటేశ్ గ్లామర్, భీమ్స్ మ్యూజిక్వెంకటేశ్ అభిమానులు మాత్రమే కాకుండా, కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సంక్రాంతి పండగకి సరిపోయే సరదా, వినోదం, కుటుంబ కథాంశంతో సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.