తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలక మండలి పై చర్చలు జరుగుతున్నాయి. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో పాలక మండలి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గత 15 సంవత్సరాలుగా ఈ ఆలయానికి పాలకమండలి లేకుండా నడుస్తున్నప్పటికీ, ఇప్పుడు ఈ వ్యవస్థను కొత్తగా రూపొందించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఒక సమగ్ర ప్రణాళికతో, ఈ ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తయారుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రూ.1,250 కోట్లతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. అప్పటి నుంచి భక్తుల సంఖ్య బాగా పెరిగింది, అంతే కాకుండా వేలాదిమంది భక్తులు పండుగ సమయాల్లో అక్కడికి వస్తున్నారు. అయితే, ఈ పాలక మండలిని ఏర్పాటు చేయడం క్రమంలో కొన్ని చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రస్తుతం యాదగిరిగుట్ట ఆలయ చైర్మన్‌గా వంశపారంపర్య ధర్మకర్త నరసింహ మూర్తి ఉన్నారు.ప్రస్తుతం, వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులందరూ ఈ బోర్డులో సభ్యులుగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వ్యక్తిని మాత్రమే చైర్మన్‌గా నియమించడం చట్టబద్ధంగా భావించబడింది. కానీ, కొత్త బోర్డు ఏర్పాటులో ప్రభుత్వంను వ్యతిరేకించే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం, ఈ చట్టం 1987లో రూపొందిన “తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ చట్టం” ఆధారంగా పనిచేస్తోంది. బోర్డు ఏర్పాటుకు కొన్ని సవరణలు అవసరమవుతాయి. ముఖ్యంగా, ఈ బోర్డు చైర్మన్ గా వంశపారంపర్య ధర్మకర్త కాకుండా వేరే వ్యక్తిని నియమించాలనుకుంటున్నారు. ఈ సవరణలపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు జరుపుతుంది.పాలక మండలికి అనుమతులు ఇవ్వడానికి న్యాయశాఖ ఇప్పటికే సానుకూలంగా నిర్ణయించింది. యాదగిరిగుట్టకు న్యాయపరమైన చిక్కులు లేకుండా పాలక మండలి ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బోర్డు ఏర్పాటుకు అవసరమైన చట్ట సవరణలను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సంకల్పించారు.