తాజాగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరైన అల్లు అర్జున్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ప్రశ్నించారు.ఈ విచారణలో ఏసీపీ రమేశ్,సీఐ రాజు కూడా పాల్గొన్నారు.విచారణ సందర్భంగా అధికారులు 20 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని అల్లు అర్జున్‌కు అందించారు.సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ తన వెర్షన్ చెప్పిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని,రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే, ఈ ఘటన విచారణలో భాగంగా పోలీసులు ఆయనను A11గా గుర్తించి అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు,హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా టెక్నికల్ కారణాలతో అర్జున్ ఆ రాత్రి జైలులోనే గడిపారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత బాధిత కుటుంబాలకు మరింత భరోసా ఇచ్చారు అల్లు అర్జున్.చట్టంపై తనకు గౌరవం ఉందని,విచారణలో పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు.అయితే ఈ ఘటనపై రాజకీయ రచ్చ మొదలైంది.సంధ్యా థియేటర్‌లో జరిగిన ఘటనకు కారణాలు, ప్రత్యక్ష, పరోక్ష బాధ్యతదారులపై చర్చ పెరుగుతోంది.సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోలను పోలీసులు విడుదల చేశారు. ఈ వీడియోల ఆధారంగా విచారణలో కీలక ప్రశ్నలు సంధించనున్నారు.బెయిల్ రూల్స్ ఉల్లంఘన, ప్రెస్ మీట్ వివాదం వంటి అంశాలు కూడా విచారణలో ప్రాధాన్యంగా నిలిచాయి. అదే సమయంలో, ఓయూ జేఏసీ కార్యకర్తలు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించటం పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు కాగా, వారు బెయిల్ పై విడుదలయ్యారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.ప్రస్తుతం పోలీసుల దృష్టి అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహణ, అతని సోషల్ మీడియా పోస్టులపై ఉందని తెలుస్తోంది.