హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్స్ వరకు అనుమతి ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తక్కిసలాట జరగడం, ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఇప్పటికీ కోమలోనే మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తుతో చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
“నేను సినీ ప్రముఖులకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి షూటింగ్లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి. ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నేను కుర్చీలో ఉన్నంత వరకూ ఇలాంటి ఘటనలను ఉపేక్షించను. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ప్రభుత్వం వదిలి పెట్టదు” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.