అంతర్జాతీయ వన్డేల్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరో చరిత్రాత్మక ఘనతను సాధించింది.21వ శతాబ్దంలో దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా మూడు వన్డే సిరీస్‌లు గెలుచుకున్న తొలి జట్టుగా రికార్డుల్లో నిలిచింది.గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో గెలిచి, మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో తమ పేరిట లిఖించుకుంది.దక్షిణాఫ్రికా గడ్డపై పాకిస్థాన్ జట్టు వరుసగా మూడో వన్డే సిరీస్‌ను గెలిచింది.2013, 2021లలో సాధించిన విజయాలకు తోడు, ఈ సారి కూడా సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ఏడు పర్యటనల్లో మూడు సార్లు సిరీస్‌ను గెలవడం విశేషం. ఈ ఘనతను తర్వాతి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కూడా చేరుకోలేకపోయింది. ఆసీస్ 10 పర్యటనల్లో కేవలం మూడు సార్లు మాత్రమే సిరీస్‌ను గెలుచుకుంది.ఈ విజయంతో పాక్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఎంతో హర్షం వ్యక్తం చేశాడు.
“మా జట్టు ప్రతీ ఒక్కరూ అద్భుతంగా రాణించారు. మ్యాచ్ ప్రారంభంలో వికెట్లు కోల్పోయినా, బాబర్ ఆజామ్‌తో కలిసి నేను ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాం.మొదట 300 పరుగులు లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ కమ్రాన్ గులామ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో 320 పరుగులు చేయగలిగాం.మా బౌలర్లు తమ భాద్యతను చక్కగా నిర్వహించారు” అని రిజ్వాన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్‌లో మహమ్మద్ రిజ్వాన్ (80), బాబర్ ఆజామ్ (73), కమ్రాన్ గులామ్ (63) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. అనంతరం 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకే కుప్పకూలింది. హెన్రీచ్ క్లాసెన్ (97) ధాటిగా ఆడినా, సెంచరీని చేజార్చుకున్నాడు.మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో, ఆతిథ్య జట్టు ఓటమి చెందక తప్పలేదు.పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది 4 వికెట్లు, నసీమ్ షా 3 వికెట్లతో జట్టు విజయానికి కీలకంగా నిలిచారు.