న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అనుమతి ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే స్పందించింది.
ఆమ్ ఆద్మీ పార్టీని భూస్థాపితం చేసేందుకు బీజేపీ పన్నాగం పన్నిందని విమర్శించింది. ఆప్ ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేందుకు ఆ పార్టీ ఈ తరహా కుట్రకు తెర తీసిందని ఆరోపించింది. ఢిల్లీ మద్యం విధానంపై గత రెండేళ్లుగా ఈడీ దర్యాప్తు చేస్తుందని గుర్తు చేసింది. కానీ ఈ కేసులో నేటికి ఏమీ దొరక లేదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా.. దాదాపు 500 మందిని విచారణ పేరుతో హింసిస్తోందంటూ బీజేపీపై ఆప్ విమర్శలు గుప్పించింది.
కాగా, ఇక మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మరింత సమయం ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఛార్జిషీట్లను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఈ ఇద్దరు నేతలు పిటిషన్ ద్వారా కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అందుబాటులో లేరంటూ జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీకి ఈడీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిపై జనవరి 30వ తేదీన విచారణ జరుపుతామని జస్టిస్ ఓహ్రీ స్పష్టం చేశారు.