హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో అప్పుల బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన వార్తను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ‘ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు?’ అంటూ కేటీఆర్ షేర్ చేశారు. ఆటోడ్రైవర్లకు ఇస్తానన్న రూ.12వేల సాయం ఏమైందని సీఎం రేవంత్‌ను కేటీఆర్ నిలదీశారు. ఆటో డ్రైవర్లతో పాటు అన్ని వర్గాలను మోసగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు. ఇదే ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు!” అని కేటీఆర్ అన్నారు. “ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో ధగ ధగ మెరిసిన చేతుల్లోకి పురుగు మందు డబ్బాలు రావడమే మార్పా? ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? రేవంత్.. ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న రూ. 12వేల సాయమేది? రాహుల్ గాంధీ.. ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను సీఎం మోసగించారు..అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా, హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఆటోవాలాలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి తమ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నందుకు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 100 మందికిపైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇకపై ఎవరూ అలాంటి పనులు చేయొద్దని భరోసానిచ్చారు. మీ సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ హామీ ఇచ్చారు.