హైదరాబాద్: శాసన సభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఫార్ములా ఈ రేసుపై చర్చ జరపాలని బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీలో పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం దానికి అనుమతించకపోవడంతో వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశం మీద అసెంబ్లీలో చర్చ జరపాలని బీఆర్‌ఎస్ సభ్యులు ఈరోజు పట్టుబట్టారు.
ప్రపంచస్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచే లక్ష్యంతో హైదరాబాద్ నగరానికి ఫార్ములా ఈ కారు రేసింగ్‌ను కేటీఆర్ తీసుకొస్తే.. ఆయనపై అక్రమ కేసులు పెట్టడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ అంశంపై చర్చకు పెడితేనే నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ కారు రేసింగ్‌పై చర్చకు అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా, కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని చెప్పారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో స్పీకర్ చాంబర్‌లో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో రకరకాల లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా-ఈ రేస్ నిర్ణయం తీసుకున్నామన్నారు.