అమరావతి: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. 2025 సంవత్సరం క్యాలెండర్లను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. టీటీడీ 2025 క్యాలెండర్లు, డైరీలు ఆన్‌లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 2025 సంవత్సరానికి సంబంధించిన 12 పేజీలు, 6 పేజీలు, టేబుల్ టాప్, సింగల్ షీట్ క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్ లైన్‌లోనూ క్యాలెండర్లు దొరుకుతాయన్న టీటీడీ ఛైర్మన్.. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబయి, వేలూరు, ఇతర ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా టీటీడీ క్యాలెండర్ బుక్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు.
కాగా, టీటీడీ క్యాలెండర్‌కు భక్తుల్లో మంచి డిమాండ్ ఉంది. శ్రీవారి అపురూప చిత్రాలతో ఈ క్యాలెండర్ రూపొందిస్తారు. దీంతో శ్రీవారి భక్తులు టీటీడీ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ నూతన సంవత్సరం క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. బుక్ చేసుకున్నవారికి పోస్టల్ సిబ్బంది సహకారంతో నేరుగా ఇంటి వద్దకే సరఫరా చేస్తారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.