హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు న్యాయ నిపుణులతో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు స మాచారం. ఫార్ములా-ఈ రేసుకు సం బంధించి ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్టు తెలిసింది.
కాగా, ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదయింది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే విదేశీ కంపెనీకి రూ. 55 కోట్ల నిధులు చెల్లించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో కేటీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉంది.
మరోవైపు అదానీ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. జాతీయ స్థాయిలో అదానీ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అనుకూలంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు కేటీఆర్ లేఖ రాశారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న అదానీ వ్యతిరేక నిరసనలను రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రజలు క్షమించరని అన్నారు.