వైసీపీ నేత సజ్జల భార్గవ రెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది.
ఫిర్యాదు చేయలేదు
భార్గవరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది విచారణకు అర్హత లేని కేసు అని ఆయన కోర్టుకు తెలిపారు. ఎవరిపై అయితే పోస్టులు పెట్టారో… వారు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఎవరో మూడో వ్యక్తి చెపితే కేసులు నమోదు చేశారని చెప్పారు. ఐటీ సెక్షన్స్ కు బదులుగా, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని భార్గవరెడ్డి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
ఫిబ్రవరికి వాయిదా
ఈ క్రమంలో, బీఎన్ఎస్ సెక్షన్ 35 (3)కి అనుగుణంగా నోటీసులు జారీ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. భార్గవరెడ్డిపై చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను అప్పటి వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.