ఇటివలకాలంలో ఏపీలో తరచుగా అల్పపీడనం ఏర్పడుతున్నది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలవైపు వెళ్తుందని, ఆ తర్వాత కోస్తా తీరం వెంబడి కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో భారీ వర్షాలతోపాటు తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో నేడు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.
ప్రభుత్వం అప్రమత్తం
తుపాను కారణంగా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. మంత్రివర్గం పరిస్థితులను గమానిస్తూ అధికారులను తీసుకోవసిన చర్యలపై ఆదేస్తున్నారు.
మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కాగా, వాతావరణ మార్పుల కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో, అక్కడ తీరం దాటాల్సినవి మన రాష్ట్రంలో దాటుతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.