నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి ఆరోగ్యంలో సమస్యలు కనిపించడంతో స్థానికంగా ఆందోళన మొదలైంది. ఈ సమాచారం బయటకు రావడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందుగా నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడికి చికిత్స అందించారు. అయితే, వ్యాధి నిర్ధారణ కాలేకపోవడంతో అతడిని చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగిస్తున్నప్పటికీ, పూర్తి నిర్ధారణ కోసం బాలుడి రక్త నమూనాలను పుణేలోని ప్రముఖ ల్యాబ్కు పంపించారు. నివేదికల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
జికా వైరస్ లక్షణాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలుగా వెంకటాపురం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైరస్ గురించి అవగాహన కల్పించి, అవసరమైన మందులు, చికిత్సలు అందిస్తున్నారు. జికా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రాధాన్యతతో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గ్రామంలోని నీటి నిల్వలు, శుభ్రత పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి, రోగలక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించనున్నారు. ఇదే సమయంలో జికా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా వెంటనే స్థానిక వైద్య కేంద్రాలకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.