‘ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు లోక్‌సభలో ఖరాఖండిగా చెప్పామని డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అందుకే తాము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె తెలిపారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు సమాఖ్య హక్కులకు, ప్రజల ఆకాంక్షలకు కూడా విరుద్ధమని అన్నారు.
ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారని, కానీ మీరు వాళ్ల హక్కును దూరం చేస్తారని అనుకోవడం లేదని కనిమొళి వ్యాఖ్యానించారు. బీజేపీ తమ ఇష్టానుసారంగా పాలని చేస్తుందని, ప్రజల ఇష్టాలకు పరిగణనలోనికి తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఎన్నేళ్లు ఉండాలనే అధికారాన్ని ప్రజల నుంచి లాక్కుని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు. అలా చేయడం రాష్ట్రాలకు, సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు.
రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం
కేంద్రం ఆ బిల్లును అమల్లోకి తీసుకొస్తే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం కలుగుతుందని అన్నారు. కాబట్టి తాము ఈ బిల్లును అంగీకరించబోమని అన్నారు. ఇవాళ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాంతోపాటే బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించి జేపీసీకి అప్పగించారు.