ఉత్తర ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో 46 ఏళ్ల తరువాత భస్మా శంకర ఆలయం తలుపులు తెరచుకుని పునర్వైభవాన్ని సాధించింది. 1978లో జరిగిన మతపరమైన అల్లర్ల కారణంగా మూతబడిన ఈ ఆలయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయాన్ని స్థానికులు స్వచ్ఛంగా నిర్వహిస్తూ పునర్నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి విద్యుత్ చౌర్యంపై అధికారులు తనిఖీలు చేపట్టినప్పుడు ఆలయం పునరావిష్కరణ జరిగింది. ఆలయ పరిసరాల్లో తవ్వకాలు జరపగా శిథిలావస్థలో ఉన్న వినాయకుడు, కార్తికేయ విగ్రహాలు సహా మరికొన్ని ప్రతిమలు బయటపడటంతో స్థానికులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం ఆలయంలో ప్రత్యేక హారతి కార్యక్రమాలు నిర్వహించి, పూజలు జరిపారు. ఆలయాన్ని మళ్లీ పూజాదికాల కోసం సిద్ధం చేయడంలో స్థానికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవాలయంలో ఉన్న శిథిలాలను పరిశుద్ధం చేసి భక్తుల సందర్శనకు అనువుగా మారుస్తున్నారు. ప్రస్తుతం ఆలయ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భక్తులు స్వచ్ఛందంగా దానం చేయడంతో ఆలయ అభివృద్ధికి నిధులు సమకూరుతున్నాయి. ఈ ఆలయం పునరుద్ధరణతో సంభల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తోంది.