‘చిడో’’ తుపానుతో ఫ్రాన్స్ అతలాకుతలంగా మారింది. వేలాదిమంది మరణిస్తున్నారు. పలు ప్రాంతాలు జలమయం అయినాయి. హిందూ మహాసముద్ర ద్వీప సమూహంలోని మయోట్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన తుపాను ‘చిడో’ వేలాదిమంది ప్రాణాలు బలిగొంది. గత శతాబ్ద కాలంలోనే ఇది అత్యంత బలమైన తుపాను అని ఫ్రెంచ్ అధికారులు చెబుతున్నారు. తనకు తెలిసినంత వరకు ఈ తుపాను కారణంగా కొన్ని వేలమంది మృతి చెంది ఉంటారని ఆయన పేర్కొన్నారు.
వేలల్లో క్షతగాత్రులు
క్షతగాత్రులు కూడా వేలల్లో ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మృతుల సంఖ్యను కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని ఫ్రెంచ్ అంతర్గతశాఖ మంత్రి పేర్కొన్నారు. చిడో తుపాను రాత్రికి రాత్రే మయోట్‌ను తాకినట్టు చెప్పారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నట్టు వివరించారు. గత 100 ఏళ్లలో ఇంత బలమైన తుపాను ద్వీపాన్ని ఎన్నడూ తాకలేదని స్థానిక వాతావరణశాఖ తెలిపింది.
వేలాది గృహాలు శిథిలం
నిజం చెప్పాలంటే తాము విషాదాన్ని అనుభవిస్తున్నామని, అణుయుద్ధం తర్వాత ఉండే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని మయోట్ రాజధాని మమౌద్జౌ నివాసి ఒకరు తెలిపారు. తమ పొరుగు ప్రాంతం మొత్తం అదృశ్యమైందని చెప్పుకొచ్చారు. వేలాది గృహాలు శిథిలమైన ఏరియల్ వ్యూ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం యుద్ధప్రాదిపతికిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.