సోనూసూద్ తన కొత్త సినిమా ‘ఫతే’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రానికి ఆయన స్వయంగా దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. సోనూసూద్ భార్య సోనాలి సూద్ ఈ సినిమాను నిర్మించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్,నసీరుద్దీన్ షా,విజయ్ రాజ్ లాంటి ప్రముఖ తారాగణం ఇందులో భాగస్వామ్యమైంది.ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను అలరించనుంది.సోనూసూద్ తన సాహసోపేత పాత్రలతో పాటు సామాజిక సేవల ద్వారా కూడా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కోవిడ్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు తన సహాయంతో జీవనాధారాన్ని అందించిన ఆయన, ఇప్పటికీ ఆ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు.
ఈ కారణంగానే, తెరపై విలన్ పాత్రలు పోషించినా, నిజ జీవితంలో సోనూసూద్ అందరికీ రియల్ హీరోగా పేరు పొందాడు. ఇప్పుడు ఆయన మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. ‘ఫతే’ సినిమా ద్వారా వచ్చే మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లను వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఇది సోనూసూద్ మంచితనానికి మరో ఉదాహరణగా నిలుస్తోంది.ఫతే సినిమా కథ సైబర్ క్రైమ్ నేపథ్యంలో నడుస్తుంది.కరోనా కాలంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా ఈ కథను రాశారు.సైబర్ భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సినిమాకు ప్రధాన లక్ష్యం. ఈ సినిమాతో సోనూసూద్ డైరెక్టర్గా పరిచయం అవుతుండటం విశేషం.తన మొదటి దర్శకత్వ ప్రయత్నంలోనే ఆయన సాంకేతికతను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమా రూపొందించారు. సోనూసూద్ మాట్లాడుతూ, “ఈ సినిమా ప్రజలలో అవగాహన కల్పించడానికే.సైబర్ మోసాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో, వాటిని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాం,”అన్నారు. ఈ చిత్రానికి సోనూసూద్ భార్య సోనాలి నిర్మాతగా వ్యవహరిస్తుండటం గమనార్హం.సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఆధ్యాత్మిక ఆలోచనలతో పాటు మంచి సందేశాన్ని అందించనుంది.