భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం ఉదయం అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. బీజేపీ పార్టీకి ఎనలేని సేవలు అందించిన అద్వానీ గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ఎల్ కె అద్వానీ కీలకపాత్ర వహించారు. అంతేకాక పార్టీ వృద్ధికి అయన కృషి చేసారు. ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రెండు నెలల క్రితం కూడా అద్వానీ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారు. కాగా, అద్వానీ అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్వానీ తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.