సుప్రసిద్ధ హీరో అల్లు అర్జున్ చంచల్ గూడా జైలు నుంచి శనివారం ఉదయం విడుదలయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో సంబంధించి అతనిపై కేసు నమోదు చేయడం, అనంతరం అరెస్టు చేసి రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తింది. సంధ్య థియేటర్ వద్ద ఇటీవల జరిగిన ఘటనలో భారీగా జనసందోహం ఏర్పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.పోలీసుల విచారణలో అల్లు అర్జున్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు.దీనితో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.రిమాండ్ అనంతరం అల్లు అర్జున్‌ను చంచల్ గూడా జైలుకు తరలించారు.ఈ పరిణామాలు ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి.అయినా, అతని కుటుంబసభ్యులు,న్యాయవాదులు విశ్వాసాన్ని కోల్పోలేదు. అప్పటి నుంచి హైకోర్టులో బెయిల్ కోసం బన్నీ తరఫు న్యాయవాదులు కృషి చేశారు.తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణలో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ ప్రాసెస్‌లో భాగంగా అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు రూ.50 వేల పూచీకత్తు సమర్పించారు.అయితే, శుక్రవారం రాత్రి జైలు సూపరింటెండెంట్‌కు బెయిల్ పత్రాలు ఆలస్యంగా అందుకోవడంతో బన్నీ రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది.శనివారం తెల్లవారుజామున అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ చంచల్ గూడా జైలుకు చేరుకున్నారు. అవసరమైన ప్రాసెస్ పూర్తయిన తరువాత, బన్నీ జైలు నుంచి విడుదలయ్యారు.విడుదల క్షణాల్లో అభిమానులు జైలు బయట పెద్ద ఎత్తున గుమికూడి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.”బన్నీ” అని నినదిస్తూ, అతనిపై ప్రేమను కురిపించారు.జైలు నుంచి విడుదలైన వెంటనే, అల్లు అర్జున్ తన తండ్రితో కలిసి ఇంటికి బయలుదేరారు. ఈలోపే ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.అభిమానుల కోసం బన్నీ కారులో నుంచి చేయి ఊపి తన కృతజ్ఞతను తెలియజేశారు.