సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయకుంటే తాను కోర్టులో పిల్ వేస్తానన్నారు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు తనకు తెలిసిందన్నారు. ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ కు బన్నీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. పుష్కరాలు సహా వివిధ ఘటనల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా కొంతమంది మృతి చెందితే చంద్రబాబును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని కేఏ పాల్ ప్రశ్నించారు.
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు సరే… మరి చంద్రబాబు కందుకూరులో ర్యాలీ నిర్వహించినప్పుడు 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోయారన్నారు. 2019లో ఆయన పుష్కరాల్లో స్టంట్స్ చేస్తే 23 మంది చనిపోయారన్నారు. మరి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారా? విచారణకు పిలిచారా? అని నిలదీశారు. బలవంతులైన రాజకీయ నేతలకు ఓ న్యాయం… సాధారణ వ్యక్తులు, నటులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.