తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం పై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని, ఇప్పుడు ఆ రూపాన్ని మార్చడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌పై సీఎం రేవంత్ కు అవగాహన లేదని ఆరోపించారు. “ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన వారికి ఈ రూపం ప్రత్యేకమైనది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భారత్ మాత రూపాన్ని గెజిట్‌లో చేర్చలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహంపై జీఓ ఇవ్వడం దారుణం” అని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కారు పూర్తిగా పార్టీ ప్రయోజనాలకే మొగ్గుచూపుతోందని, తెలంగాణవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని కవిత మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం అందరికీ స్ఫూర్తిదాయకమైందని, దానిపై జీఓ ఇచ్చే స్థాయికి దిగజారడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. తెలంగాణ తల్లి రూపం ఉద్యమానికి ప్రాణస్ఫూర్తి. అలాంటి గుర్తింపును మార్చే ప్రయత్నం చరిత్రకే అవమానం అని అన్నారు.తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారు? – ఎమ్మెల్సీ కవిత