భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ అతి చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ (18)గా అవతరించిన సంగతి తెలిసిందే. కొడుకు విజయం కోసం పరితపించిన అతడి తండ్రి రజినీకాంత్, ఆ కల నెరవేరే సమయంలో సంతోషం కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. రిజల్ట్ కోసం ఆందోళనగా తిరిగిన ఆయన గుకేశ్ గెలిచాడని తెలియగానే వేగంగా లోపలికి వెళ్లారు. కొడుకును చూసిన అనంతరం పుత్రోత్సాహంతో హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. దొమ్మరాజు గుకేశ్ అతి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాడు.
గురువారం జరిగిన ఆఖరిదైన 14వ గేమ్‌లో నల్లపావులతో బరిలోకి దిగిన ఈ 18 ఏండ్ల కుర్రాడు..లిరెన్(6.5)ను కట్టిపడేస్తూ 7.5 పాయింట్లతో టైటిల్ ఒడిసిపట్టుకున్నాడు. గేమ్‌కు ముందు ఇద్దరు 6.5 పాయింట్లతో సమంగా ఉండగా, విజేతను నిర్ణయించే ఈ పోరులో గుకేశ్‌కు అదృష్టం కలిసోచ్చింది. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఫైనల్ గేమ్ పోరు 58 ఎత్తుల్లో ముగిసింది. అప్పటి వరకు కనీసం డ్రా కోసమైనా ప్రయత్నం చేద్దామనుకున్న గుకేశ్‌కు లిరెన్ చేసిన ఘోర తప్పిదం ప్రపంచ విజేతగా నిలిచేలా చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుకేశ్, 2006 మే 29న జన్మించాడు. అతను బాల్యం నుంచే చెస్ పై ప్రత్యేక ఆసక్తిని చూపించి, అనేక విజయాలను సాధించాడు. 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో అర్హత సాధించడం అతని ప్రతిభను ప్రతిబింబిస్తుంది. చిన్న వయసులోనే అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందిన గుకేశ్, ఈ ఘనతను సాధించిన అతి చిన్న భారతీయుడిగా నిలిచాడు. అతని శిక్షణలో అతని తల్లిదండ్రులు, కోచ్‌ల సహకారం ముఖ్యమైన పాత్ర పోషించాయి. ప్రత్యేకంగా గుకేశ్ తండ్రి అతనికి మొదటి గురువు. అతని క్రమశిక్షణ, మేధా గుణం గుకేశ్‌ను ముందుకు నడిపించాయి. గుకేశ్ తన కెరీర్‌లో అనేక అరుదైన రికార్డులను సాధించాడు.
గత 10 ఏండ్లుగా ఈ చిరస్మరణీయ విజయం కోసం ఎదురుచూస్తున్నాను. కల సాకారం కావడం చాలా సంతోషంగా ఉంది. గెలుపు ఆసలు ఊహించలేదు అందుకే ఒకింత ఉద్వేగానికి గురయ్యాను. ప్రతీ ప్లేయర్ ఇలాంటి కల కోసం ఎదురుచూస్తాడు. క్యాండిడేట్స్ టోర్నీ నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్ వరకు నా వెన్నంటి నిలిచిన భగవంతునికి కృతజ్ఞతలు. 2013లో విశీసార్(ఆనంద్), కార్ల్‌సన్ మధ్య పోరు టీవీలో చూశాను. ఆ టోర్నీలో కార్ల్‌సన్ గెలువడంతో ఎలాగైనా ప్రపంచ టైటిల్‌ను భారత్‌కు తిరిగి తీసుకురావాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. కార్ల్‌సన్ అంత స్థాయికి ఎదుగాలనుకుంటున్నాను. లిరెన్ నిజమైన ప్రపంచ చాంపియన్. అతని పోరాట పటిమ అమోఘం.నా విజయంలో మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్ పాత్ర చాలా విలువైనది. 12 గేమ్ తర్వాత నాకు సరైన నిద్ర లేదు. ఈ సమయంలో ప్యాడీని సంప్రదించడం కలిసొచ్చింది.