జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్
పక్షుల పండుగను మొదలైన సన్నాహాలు
తిరుపతి జిల్లా (శ్రీహరికోట )
సూళ్లూరుపేటలోని పులికాట్ సరస్సు అంతర్జాతీయ పక్షుల పండుగకు సిద్ధం అయ్యింది. ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట ఇక్కడ ప్రతి ఏటా ఘనంగా పక్షుల పండుగ జరుగుతుంది. శీతాకాల సమయంలో విదేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పెద్ద సంఖ్యలో పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి. 2001లో ఈ పండుగ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో పక్షుల పండుగపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. జనవరి నెలలో ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు ప్రారంభించింది. గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న సూళ్లూరుపేట ప్రస్తుతం తిరుపతి జిల్లాకు మారింది. నూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నూళ్లూరుపేట, అటకానితిప్ప, నేలపట్టు, భీములవారిపాలెం తదితర చోట్ల పండుగ జరుపుతామని తిరుపతి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఇటీవల ప్రకటించారు. దీనికి తగ్గట్టే సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఒకటికి రెండుసార్లు ముఖ్యమంత్రిని కలిసి ఈ పండుగకు నిధులు మంజూరు వేయాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆమె మంగళవారం తాడేపల్లిలో సీఎంను కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ పై మాట్లాడారు. ఈసారి ఉమ్మడి ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులను ఈ పండుగను ఆహ్వానించి పక్షుల పండుగకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జలకళతో పెరగనున్న
విదేశీ విహంగాలు
ఇటీవల భారీ వర్గాలు కురపిన కారణంగా పులికాట్ సరస్సులో సంవృద్దిగా నీరు చేరింది. నేలపట్టు చెరువులోని చెట్లపై వక్షులలో రారాజుగా పెలికాన్లు ఎక్కువ సంఖ్యలో కొలువుతీరాయి. గూడబాతుగా ఈ ప్రాంతం వారు ఈ పక్షులను పిలుస్తున్నారు. పులికాట్ సరస్సులో సంవృద్ధిగా నీరు చేరడం వలన విహంగాల విద్యాసాలు ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ సముద్రపు రామచిలకలు అని పిలిచే ఫ్లెమింగోలు గుంపులు గుంపులుగా విహరిస్తున్నాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకలకు ఉత్సాహపడుతున్నారు. అయితే స్థానిక వన్యమృగ సంరక్షణ శాఖ అధికారులు విదేశీ విహంగాలపై తగిన ప్రచారం చేయలేకపోతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు కూడా క్రమబద్ధీకరించలేక పర్యాటకులకు ఏ విధంగాను సహకారం అందించడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహించి దూరప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వినోదం కలిగించే విహంగాలపై ప్రచారం విస్తృతం చేయాలని భావిస్తున్నారు. .