తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమం ఆశాజనక ఫలితాలను సాధిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి తెలిపిన దాని ప్రకారం.. ఈ పథకం ద్వారా 27 వేలకుపైగా సమస్యలు పరిష్కరించబడ్డాయి. ఈ నెల 8న ఈ పథకం ప్రారంభించి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం వార్షిక నివేదికను విడుదల చేసింది. ప్రజల ఫిర్యాదులను విన్నవించి, వాటికి తక్షణమే పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటి వరకు 82,955 అప్లికేషన్లు అందాయి. ఇందులో 43,272 ఫిర్యాదులు గ్రీవెన్సులుగా నమోదయ్యాయి. ఈ మొత్తం ఫిర్యాదుల్లో 62 శాతం సమస్యలు పరిష్కరించబడ్డాయని డిప్యూటీ సీఎం వివరించారు. మిగతా ఫిర్యాదులు ప్రాసెస్లో ఉన్నాయని, త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతామని భట్టి తెలిపారు.
ఈ పథకం ద్వారా ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి నేరుగా తెలియజేయగలిగే అవకాశం పొందారు. గ్రీవెన్స్ల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు నియమించబడటంతో సమస్యల పరిష్కారం వేగవంతమైంది. ప్రజావాణి ద్వారా ముఖ్యంగా పెన్షన్లు, భూమి సమస్యలు, రేషన్ కార్డులు వంటి అంశాలకు సంబంధించి తక్షణ పరిష్కారం లభిస్తోంది. ఇదిలా ఉంటె ప్రజావాణి పథకంపై ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోంది. అయితే, కొన్ని ఫిర్యాదులు ఆలస్యం కావడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపమే ఈ ఆలస్యం కారణమని కొందరు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ, పథకం ప్రజలకు అందుబాటులో ఉండడం సంతృప్తికరమని విశ్లేషకులు అంటున్నారు.