న్యూఢిల్లీ: సిరియాలో నెలకొన్న పరిస్థితుల మధ్య అక్కడున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా 75 మంది భారత పౌరులను డమాస్కస్ నుంచి లెబనాన్‌కు సురక్షితంగా తీసుకొచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 75 మంది భారతీయుల్లో 44 మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన జైరిన్ (యాత్రికులు)లు ఉన్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది.
వారంతా సిరియా సరిహద్దులు దాటి క్షేమంగా లెబనాన్‌కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచి వారంతా వాణిజ్య విమానాల ద్వారా లెబనాన్ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నట్లు తెలిపింది. ఇంకా అనేక మంది భారతీయులు సిరియాలో ఉన్నారని వెల్లడించింది. వారంతా డమాస్కస్‌లోని రాయబార కార్యాలయంతో +963 993385973 వాట్సప్‌లో, hoc.damascus@mea.gov.in ఇ-మెయిల్ ద్వారా టచ్‌లో ఉండాలని పేర్కొంది.
కాగా, సాయుధ తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్ సిరియాను వీడారని రష్యా ప్రభుత్వం తెలిపింది. ఇక, అసద్ సిరియాను వీడిన వెంటనే నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని రెబల్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ రెబల్స్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అసద్ కుటుంబం సుమారు అయిదు దశాబ్ధాల నుంచి సిరియాను పాలిస్తున్నది. అయితే రెబల్స్ తిరుగుబాటుతో.. ఆదివారం దేశాన్ని విడిచి వెళ్లారు.