బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ(92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1999 నుంచి 2004 వరకు ఎస్ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2004 నుంచి 2009 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు. అనంతరం అంటే 2009లో మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
కాగా, 1932, మే1వ తేదీన మాండ్య జిల్లాలోని సోమనహళ్లిలో ఎస్ ఎం కృష్ణ జన్మించారు. మైసూర్‌లోని మహారాజా కాలేజీ నుంచి ఆయన డిగ్రీ పట్టా అందుకోన్నారు. అనంతరం బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత ఉన్న విద్య కోసం యూఎస్ వెళ్లారు.
ఆ క్రమంలో డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ, జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను ఆయన అభ్యసించారు. ఆ తర్వాత.. ఆయన తిరిగి భారత్ వచ్చారు. 1962లో మడ్డురు అసెంబ్లీ స్థానం నుంచి ఎస్ఎం కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అలా కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఆయన అడుగు పెట్టారు.
ఇక, కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరం.. ఐటీ హబ్‌గా మారడంలో ఎస్ ఎం కృష్ణ కీలక పాత్ర పోషించారన్న విషయం అందరికి తెలిసిందే. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఆయన పని చేశారు. చివరకు అంటే.. 2017లో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. 2023లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ ప్రకటించింది.