మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల గొడవలు ఇప్పుడు పోలీసులు స్టేషన్లలో ఒకరిపై ఒకరు ముప్పు ఉందంటూ పిర్యాదులు చేసుకునే వరకు వచ్చింది. ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు, తన కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై రాచకొండ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంఘటన సంచలనంగా మారింది. మోహన్‌బాబు తన ఫిర్యాదులో, తన ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్, కొంతమంది సంఘవిద్రోహ శక్తులతో కలిసి తిరిగి వచ్చి, తన ఇంటి వద్ద అలజడి సృష్టించారని ఆయన తెలిపారు.
మోహన్‌బాబు ఆరోపణలు ఇలా ఉన్నాయి: “మనోజ్‌కు చెందిన 30 మంది వ్యక్తులు నా ఇంటిలో చొరబడేందుకు ప్రయత్నించారు. నా సిబ్బందిని బెదిరించి ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. వారిదే కాదు, మనోజ్ మరియు మౌనికల ఆజ్ఞల మేరకు ఈ చర్యలు జరిగాయి” అని మోహన్‌బాబు పేర్కొన్నారు. దీంతో ఆయన తన నివాసం వద్ద పరిచయం లేని వ్యక్తులుండడంతో ఇంటికి వెళ్లలేకపోయినట్లు చెప్పారు.
మోహన్‌బాబు తన వయసు 78 సంవత్సరాలు అని , ఈ వయసులో ఈ పరిస్థితి తనకు చాలా బాధ కలిగిస్తుందని, తన ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన పోలీసుల సహాయం కోరుతూ, రాచకొండ పోలీసు కమిషనర్, పహాడీ షరీఫ్ ఎస్సై, ఏసీపీ, మహేశ్వరం డీసీపీకి ఫిర్యాదును పంపించారు. అలాగే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ సంఘటనను పరిశీలించాలని, సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంకా, మంచు మనోజ్ కూడా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఆయన ఫిర్యాదులో, నిన్న ఉదయం తన ఇంటికి పది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని చెప్పారు. వారిని ఆపడానికి ప్రయత్నించగా, ఆయనకు గాయాలు అయ్యాయని, దాడి తర్వాత ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు. అలాగే, సీసీటీవీ ఫుటేజి మాయం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి పోలీసులు ఎంతేలుస్తారో చూడాలి.