పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి గ్రామం అరుదైన గుర్తింపు లభించింది. 2024లో కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డుల్లో “మహిళా మిత్ర పంచాయతీ” విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక గ్రామంగా చిల్లపల్లి నిలిచింది. ఈ అవార్డుతో గ్రామానికి 70 లక్షల రూపాయల బహుమతిని ఈ నెల 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేయనున్నారు.
చిల్లపల్లి గ్రామం తన అభివృద్ధి ప్రగతితో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గ్రామపంచాయతీ మహిళా స్నేహపూర్వక విధానాలు, సమిష్టి ప్రణాళికలు ఈ విజయంలో కీలకమని అధికారులు తెలిపారు. 27 గ్రామపంచాయతీలకు ప్రకటించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ వికాస్ పురస్కారాల్లో చిల్లపల్లి “ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ” విభాగంలో రెండో స్థానం దక్కించుకుంది.
ఈ విజయానికి గ్రామ మహిళల శ్రమ మరియు ప్రణాళికత ప్రధాన కారణమని చెప్పవచ్చు. గ్రామంలోని మహిళలు కిరాణం, కుట్టు మిషన్ సెంటర్, బ్యూటీ పార్లర్, మెడికల్ షాపులు వంటి వ్యాపారాల్లో రాణిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. గ్రామంలో 33 మహిళా సంఘాలు సక్రమంగా నిర్వహించబడుతూ, పొదుపు ద్వారా మహిళలు స్వయం సమృద్ధికి దోహదం చేస్తున్నారు.
చిల్లపల్లి మహిళలు డ్రాగన్ ఫ్రూట్ సాగు వంటి నవీన వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ ప్రోత్సాహాన్ని అందిస్తూ, గ్రామ సభలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపేందుకు స్థానికులు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు.