టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో గల సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో తనకు ఇచ్చిన కీలక పదవికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం తనను నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు.
దిల్ రాజు తో పటు తన సోదరుడు శిరీష్ కూడా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి, రంగంలో కొత్త అవకాశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిల్ రాజును శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజును ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడంపై సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల జారీ చేశారు.
2003లో విడుదలైన దిల్ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దిల్ రాజు, టాలీవుడ్లో అగ్రశ్రేణి నిర్మాతగా ఎదిగారు. ఈ సినిమా విజయంతో ఆయన పేరు పరిశ్రమలో దిల్ రాజుగా మారింది. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తోంది.