మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 218 సీట్లతో ‘మహాయుతి’ కూటమి అఖండ విజయం ఖాయమైంది. దీంతో ఓవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఈసారి ఎవరిని వరించబోతోందనే చర్చ జరుగుతుండగా, మరోవైపు కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఎప్పుడనే అంశం కూడా తెరపైకి వచ్చింది.
మహారాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 5న కొలువు దీరుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సౌత్ ముంబైలోని ఆజాద్ మైదానంలో ‘మహాయుతి’ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని తెలిపాయి. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం డిసెంబర్ 2 లేదా 3వ తేదీన ఉంటుందని, అప్పుడే ఆ పార్టీ LP నేతను ఎన్నుకుంటుందని చెప్పాయి. అటు శిండే స్వగ్రామంలో ఉండగా, ఫడణవీస్ సీఎం పీఠం విషయంలో ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. ఈ క్రమంలో సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.
అధికారికంగా సీఎం ఎవరనేది ప్రకటించనప్పటికీ మరో నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రితో సహా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 2వ తేదీన అతిపెద్ద ఈవెంట్‌గా ఈ ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. సీఎం పదవే ప్రధాన అంశంగా ఉండటంతో కూటమి నేతలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండేనే కొనసాగించాలని షిండే శివసేన నేతల నినాదంగా ఉండగా, అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గం నేతలు తమ నేతకు సీఎం పట్టం కట్టాలంటూ పోస్టర్లు కూడా వేస్తున్నారు. మరోవైపు, బీజేపీ ప్రచారసారథిగా అత్యధిక ర్యాలీలు నిర్వహించి ఆ పార్టీకి అత్యధిక సీట్లు సాధించిపెట్టడంతో పాటు, కూటమి నేతల విజయానికి కృషి చేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌కు సీఎం పదవి ఇచ్చితీరాలని బీజేపీ నేతలు బలమైన వాదన వినిపిస్తున్నారు. కాబోయే సీఎం ఫడ్నవిస్ అంటూ పోస్టర్లు కూడా వెలిసాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి రేసులో దేవేంద్ర ఫడ్నవిస్ ముందు స్థానంలో నిలుస్తున్నారు.