న్యూఢిల్లీ: నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగనుంది. సమావేశానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు. హాజరుకానున్నారు. వీరితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, ఈవీఎంలపై చర్చ జరగనుంది.
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి దామోదర్ రాజనరసింహ, చల్లా వంశీ చందర్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజులు హాజరు కానున్నారు.
కాగా, మహారాష్ట్ర , హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశాలు ఉన్నా పార్టీ ఓటిమికి గల కారణాలను విశ్లేషించనున్నారు. తప్పు ఎక్కడ జరిగింది, లోపాలను ఎలా సవరించుకోవాలనే అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొనాల్సిందిగా సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు ఇతర నేతలను ఆహ్వానించనున్నట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. 30న మహబూబ్‌నగర్‌లో జరిగే రైతు సదస్సులో పాల్గొననున్నారు. డిసెంబర్ 4న పెద్దపల్లి, 7న నల్లగొండ జిల్లాలకు వెళ్లనున్నారు.