నరేశ్ అగస్త్య హీరోగా రూపొందిన “వికటకవి” వెబ్ సిరీస్, ప్రత్యేకంగా డిటెక్టివ్ థ్రిల్లర్ జానర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. తెలంగాణ పల్లెల పూర్వావస్థను ప్రధానంగా చూపిస్తూ, 1940-1970ల మధ్య కాలంలో నడిచే ఈ కథ, ప్రేక్షకులను రహస్య భరితమైన అద్భుత ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. రజని తాళ్లూరి నిర్మాణంలో రూపొందిన ఈ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా, మేఘ ఆకాశ్ కథానాయికగా నటించింది. ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్లు జీ5 ప్లాట్‌ఫారమ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
కథ 1970వ దశకంలో ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రాంతంలోని “అమరగిరి” అనే ఊరికి, నల్లమల అడవులు చుట్టుముట్టి ఉంటాయి. ఇక్కడ రాజా నరసింహారావు (షిజూ మీనన్) ఒక పెద్దమనిషిగా ప్రజలపై ప్రభావం చూపుతూ ఉంటారు. కానీ, తన కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప) మరణం తర్వాత, రాజా తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతాడు.
మహాదేవ్ మరణం వెనుక ఏముందో తెలుసుకునేందుకు రాజావారికి ఉత్సాహం ఉండదు.ఆదికారాలన్నీ రాజా అల్లుడు రఘుపతి చేతిలోకి వెళ్లడం, ఆయన పెత్తనం పెరిగి ఊరిని దుర్మార్గం వైపు తీసుకెళ్లడం, ప్రజలు దేవతల శాపంగా ఊహించిన “దేవతల గుట్ట” ఆ ఊరికి సంబంధించిన భయాలను పెంచడం వంటి అంశాలతో కథ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ (నరేశ్ అగస్త్య) అనే యువ డిటెక్టివ్, తన తల్లిని కాపాడేందుకు డబ్బు అవసరం కావడంతో, అమరగిరి గ్రామ రహస్యాన్ని చేధించేందుకు అక్కడికి చేరుకుంటాడు.
రామకృష్ణ అక్కడికి చేరుకున్న తర్వాత, లక్ష్మి (మేఘ ఆకాశ్)తో పరిచయం అవుతుంది. ఆమెతో కలిసి రాజావారిని కలుసుకుని, గ్రామ రహస్యాలను చేధించడానికి 48 గంటల సమయం కోరతాడు. ఈ కాలంలో అతను రాజా కుటుంబ సభ్యులైన రఘుపతి, యశోద, అర్చకుడు వంటి వ్యక్తులను విచారిస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి అమరగిరిలో జరిగిన పాత ఘటనలు, మతిస్థిమితం కోల్పోయినవారి పరిస్థితి, దేవతల గుట్టపై ఉన్న భయం వంటి అంశాల వెనుక నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.
“వికటకవి” కథలో పాత తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని నాటకీయంగా చిత్రీకరించారు. డిటెక్టివ్ కథలకు సంబంధించిన మలుపులు, రామకృష్ణ తన సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. కానీ, క్లైమాక్స్ మాత్రం కొంత నాటకీయంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మతిస్థిమితం కోల్పోయినవారిని ఒక గదిలో ఉంచడం వంటి అంశాలు కాస్త సిల్లీగా అనిపిస్తాయి. అలాగే, విలన్ ఆశించిన దానికి తగిన కారణం అందించడంలో తగిన స్పష్టత కొరవడింది. నరేశ్ అగస్త్య రామకృష్ణ పాత్రలో ఒదిగిపోయి, డిటెక్టివ్‌గా తన పాత్రను చక్కగా పోషించారు. మేఘ ఆకాశ్ పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, ఆమె పాత్రకు అవసరమైన ప్రాధాన్యత ఉంది. రాజావారి పాత్రలో షిజూ మీనన్, విలన్ పాత్రలో తారక్ పొన్నప్ప సమర్థవంతంగా నటించారు.
కెమెరా పనితనంలో షోయబ్ సిద్ధిఖీ అదరగొట్టారు. అడవి నేపథ్య సన్నివేశాలు, చీకటి సీక్వెన్స్‌లు వాస్తవికంగా కనిపిస్తాయి. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం కథనానికి బలం చేకూర్చింది. దర్శకుడు ప్రదీప్ మద్దాలి కథను ప్రాచీన గ్రామం, డిటెక్టివ్ థ్రిల్లర్‌ల సమ్మిళితంగా రూపొందించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందంగా రూపుదిద్దుకున్న “వికటకవి” సిరీస్, దాని థ్రిల్లింగ్ కథనం, కాలపు వాస్తవికత, నటీనటుల ప్రతిభతో కచ్చితంగా ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని అందిస్తుంది. కొన్ని లాజికల్ లోపాలు ఉన్నా, కథనం ఆకట్టుకోవడంతో ఈ సిరీస్‌కు ఓసారి చూసేందుకు ఖచ్చితంగా విలువ ఉంది.