హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు నుండి మూడు రోజుల పాటు ‘రైతు పండుగ’ నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సదస్సుకు అన్ని జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. నేడు జరిగే సదస్సుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు, రేపు ఇతర జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది రైతులు తరలిరానున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులు మరియు వివిధ పంట ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొంటారన్నారు.
ప్రజాపాలన విజయోత్సవం, రైతు పండగపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకుంటోందన్నారు. మిగిలిన రైతు రుణమాఫీపై 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేస్తారని తెలిపారు. రైతుబంధు ఉత్సవాలకు వేలాది మంది రైతులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పంటలను ప్రదర్శించడానికి స్టాళ్లు, వచ్చే వాహనాలకు పార్కింగ్, తాగునీరు. తాత్కాలిక మరుగుదొడ్లు, మరుగుదొడ్లు, భోజన సదుపాయాలు సిద్ధం చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు సీసీ కెమెరాల నిఘాలో రైతు పండగ కొనసాగనుంది.