న్యూఢిల్లీ: వయనాడ్ ఎంపీగా ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ ప్రమాణం చేయనున్నారు. గురువారం ఉదయం సభ ప్రారంభ కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆమె తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంక లోక్‌సభలో కూర్చోనున్నారు. తాజాగా వెలువడిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి విజయం సాధించారు. అయితే వయనాడుకు రాజీనామా చేసిన ఆయన ప్రస్తుతం రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో వయనాడ్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. గత నెల జరిగిన బైపోల్‌లో ప్రియాంకా బరిలోకి దిగారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆమె 4.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3.64 ఓట్లతో ఉన్న రాహుల్ పేరుతో ఉన అత్యధిక మెజార్టీ రికార్డును ఆమె తుడిచివేశారు. కాగా, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చవాన్ కూడా గురువారం ప్రమాణం చేయనున్నారు.