టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ తన అద్భుత ఆటతో టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ 22 ఏళ్ల హైదరాబాదీ ఆటగాడు వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించి, ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ కెప్టెన్‌గా హైదరాబాదుకు మరపురాని విజయం అందించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన తిలక్ కేవలం 67 బంతుల్లో 151 పరుగులు చేశాడు.
తన ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 225.6 ఉండటం విశేషం.ఈ ఇన్నింగ్స్‌లో తిలక్ కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేయడం, అతని దూకుడైన ఆటను సూచిస్తుంది.ఇటీవల దక్షిణాఫ్రికా టూర్‌లో, తిలక్ వర్మ టీమిండియా తరఫున మూడు, నాలుగు మ్యాచుల్లో వరుసగా సెంచరీలు సాధించాడు. సెంచరీలో 107 నాటౌట్, జోహన్నెస్‌బర్గ్‌లో 120 నాటౌట్ స్కోర్లతో అతని ఫామ్ ప్రశంసనీయంగా నిలిచింది. ఆ ఫామ్‌ను ఇప్పుడు దేశవాళీ టీ20 లోనూ కొనసాగిస్తూ హ్యాట్రిక్ సెంచరీలను నమోదు చేశాడు. తిలక్ వర్మ టీ20ల్లో 150కి పైగా స్కోరు చేసిన తొలి భారతీయ పురుష ఆటగాడు కావడం విశేషం. మహిళల విభాగంలో, కిరణ్ నవ్‌గిరే 2022లో సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో నాగాలాండ్ తరఫున 162 నాటౌట్ చేయడం గమనార్హం.తన అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్‌తో తిలక్ వర్మ టీమిండియాలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది.
అతని విధ్వంసక ఆటతీరుతో భారత క్రికెట్ భవిష్యత్తుకు మరింత వెలుగుని తీసుకొస్తున్నాడు.ఈ యువ ఆటగాడి విజయాలు అభిమానులకు, భారత క్రికెట్ ప్రేక్షకులకు ఎంతో ప్రేరణగా నిలుస్తాయి. తిలక్ వర్మ భారత క్రికెట్‌లో కొత్త అధ్యాయాలను రాసే రోజులు దూరంలో లేవు.