తెలుగు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోసాని మాట్లాడారని టీడీపీ నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో ఆయనపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) BNS సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసాని పై వరుస కేసులు నమోదు అవుతుండగా..ఇప్పుడు CID కేసు నమోదు అవ్వడం ఆయన్ను మరింత ఆందోళనకు గురయ్యాలే చేస్తుంది.
సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని మాట్లాడారన్న వంశీకృష్ణ.. వర్గాల మధ్య విబేధాలు తలెత్తేలా ఆయన మాటలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోసాని కృష్ణ మురళిపై సీఐడీ అధికారులు 111, 196, 353, 299, 336 (3) (4), 341, 61(2) బీఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం సీఐడీ కేసు నమోదు చేసింది.
మరోపక్క చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పలుచోట్ల పోసాని కృష్ణ మురళిపై పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందాయి. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలకు కడప జిల్లా రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. ఇక టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గురించి కూడా పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి. పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ పలు పోలీస్ స్టేషన్‌లలో టీడీపీ శ్రేణులు ఫిర్యాదులు చేశాయి. అనంతపురం, బాపట్ల, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి ,కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ ఫిర్యాదులు చేశారు. మరోవైపు సినీ నటి శ్రీరెడ్డిపైనా పలుచోట్ల ఫిర్యాదులు అందాయి. ఇలా ఎన్ని కేసుల నుండి పోసాని బయట పడడం కష్టమే అని అంత మాట్లాడుకుంటున్నారు.