అమరావతి: శాసన మండలిలో శాంతిభద్రతలపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారా ఘటనలను రాజకీయం చేయొద్దని అన్నారు. గతంలో పోలిస్తే.. తమ ప్రభుత్వం హయాంలో క్రైమ్ రేటు తగ్గిందని తెలిపారు. 2023లో జనవరి – అక్టోబర్ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 22,418 నేరాలు జరిగాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైమ్ తగ్గి ఇప్పటి వరకు 14,650 కేసులు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఐదేళ్ల వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో పోలీసులకు పూర్తి వసతులు కల్పించకపోయినా.. నేరాలను కట్టడి చేసేందుకు అష్టకష్టాలు పడ్డారని తెలిపారు. ‘దిశ’ యాప్ మహిళలకు ఉపయోగపడుతోందంటూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చెబుతున్నారని.. అసలు ఆ ‘దిశ’ చట్టానికి చట్టబద్దతే లేదన్నారు. నిర్భయ చట్టం ఉన్నా.. ‘దిశ’ అని లేని చట్టాన్ని తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపించారు. జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా.. తమ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని అనిత స్పష్టం చేశారు.
ఇక..జగన్ ప్రభుత్వంలో మహిళలపై లెక్కలేనన్ని దారుణాలు జరిగాయని చెప్పారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్పుకున్నారని… అసలు దిశ చట్టం ఉందా? అని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి… లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. దిశ చట్టం సరిగా పని చేసి ఉంటే మహిళలపై దారుణాలు ఎందుకు జరిగేవని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు, అనితకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, సభ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.