మణిపుర్లో పర్యటించి హింసాత్మక ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని PM మోదీని రాహుల్ గాంధీ మరోసారి కోరారు. మణిపుర్లో మళ్లీ హింస చెలరేగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా హింస జరుగుతున్నా సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని దేశ ప్రజలు ఆశగా ఎదురుచూశారన్నారు. విదేశీ పర్యటనలకు మోదీ ప్రాధాన్యమిస్తుండడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.
మణిపూర్ రాష్ట్రం మరోసారి హింసాత్మక ఘటనలతో వణికిపోతుంది. కుకీ, మైతీ వర్గాల మధ్య విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో కుకీలు కిడ్నాప్ చేసిన మైతీ వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తుల మృతదేహాలు శనివారం లభ్యమవడం రాష్ట్రంలో తీవ్ర అలజడికి కారణమైంది. ఈ హత్యల నేపథ్యంలో జిరిబామ్ జిల్లాలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు మొదలుపెట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు.
గతవారం జిరిబామ్‌లోని బోకోబెరాలో కుకీ మిలిటెంట్లు దాడి చేశారు. కొందరు మహిళలు, పిల్లలను కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది కుకీ మిలిటెంట్లు మరణించారు.కిడ్నాపైన ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురిని కుకీ మిలిటెంట్లు దారుణంగా హత్య చేశారు. ముగ్గురి మృతదేహాలు శుక్రవారం రాత్రి నదీ సమీపంలో కనిపించాయి. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. దీంతో మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంఫాల్‌లో శనివారం భారీ నిరసన చేపట్టారు. తమ వర్గం హత్యలపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎల్ సుసుంద్రో సింగ్ నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు దాడులకు దిగారు.