మణిపూర్ రాజధాని ఇంపాల్ లోని సీఎం ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై శనివారం దుండగులు దాడికి ప్రయత్నించారు. దీంతో సీఎం ఇంటి బయట ఉన్న దుండగులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘటనా సమయంలో సీఎం బీరెన్ సింగ్.. తన ఇంట్లో లేరని అధికార వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో ఆయన ఆఫీసులో సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీఎం బీరెన్ సింగ్ ఇంటిపై దాడి నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం ఇంపాల్ లో కర్ఫ్యూ విధించింది. ఏడు జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపేసింది.
మణిపూర్ రాష్ట్రం మరోసారి హింసాత్మక ఘటనలతో వణికిపోతుంది. కుకీ, మైతీ వర్గాల మధ్య విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో కుకీలు కిడ్నాప్ చేసిన మైతీ వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తుల మృతదేహాలు శనివారం లభ్యమవడం రాష్ట్రంలో తీవ్ర అలజడికి కారణమైంది. ఈ హత్యల నేపథ్యంలో జిరిబామ్ జిల్లాలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు మొదలుపెట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు.
గతవారం జిరిబామ్‌లోని బోకోబెరాలో కుకీ మిలిటెంట్లు దాడి చేశారు. కొందరు మహిళలు, పిల్లలను కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది కుకీ మిలిటెంట్లు మరణించారు.కిడ్నాపైన ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురిని కుకీ మిలిటెంట్లు దారుణంగా హత్య చేశారు. ముగ్గురి మృతదేహాలు శుక్రవారం రాత్రి నదీ సమీపంలో కనిపించాయి. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. దీంతో మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంఫాల్‌లో శనివారం భారీ నిరసన చేపట్టారు. తమ వర్గం హత్యలపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎల్ సుసుంద్రో సింగ్ నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు దాడులకు దిగారు.