లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. మంటలు చెలరేగిన వార్డులో 47 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే 31 మంది నవజాత శిశువులను సురక్షితంగా తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇక 16 మంది చిన్నారులు పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి 10.45 గంటలకు మంటల చెలరేగడంతో రోగులు, దవాఖాన సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ ఘటన జరిగిన సమయంలోఎన్‌ఐసీయూలో మొత్తం 54 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.
కాగా, శిశువుల మృతితో ఆస్పత్రి ఆవరణలో హృదయవిదారక వాతావరణం నెలకొంది. తమ బిడ్డలు సురక్షితంగా ఉన్నారా.. లేదా అని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. మిగిలిన రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.