కార్తీక పౌర్ణమి తెలుగు భక్తుల ఆధ్యాత్మిక జీవితంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. ఈ రోజున 365 వత్తులను వెలిగించడం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. ఎన్నో పండుగలకు వ్రతాలకు, పూజలకు నిలయం కార్తీకమాసం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఉత్థాన ఏకాదశి. ఆషాడశుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి నిద్ర మేల్కొనే శుభదినమది. సన్యాస దీక్షలో ఉన్నవారు చాతుర్మాస దీక్షకు స్వస్తి పలికే రోజు. దేవదానవులు చిలికిన క్షీరసాగర మథనంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిథి క్షీరాబ్ధి ద్వాదశి. ఇక శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైంది ఈ కార్తిక పౌర్ణమి. గోపికలు మాధవుడి ఉపాసన చేసే ఈ పౌర్ణమిని రాసపూర్ణిమ అనీ అంటారు. ఆరోజు సకల దేవతలు సుబ్రహ్మణ్యుణ్ని దర్శిస్తారని పఠిస్తోంది స్కాందపురాణం.
కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా 365 వత్తులతో దీపం వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని విశిష్టత ఏంటి? అనేది చూద్దాం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. జన్మ జన్మల పాపాలు పోగొట్టే అద్భుతమైన రోజు. ఈరోజు శివ, శైవ క్షేత్రాలన్నీ భక్తుల పూజలతో కళకళాడతాయి. తెల్లవారు జాము నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తుతారు.
365 వత్తుల విశిష్టత చూస్తే..
సంవత్సర భక్తి చిహ్నం:
365 వత్తులు సంవత్సరంలోని 365 రోజులను సూచిస్తాయి. ఇది ప్రతి రోజూ భగవంతుడి కృపకు కృతజ్ఞత చెప్పే సంకేతం.
కార్తీక మాసంలో దీపారాధన:
కార్తీక మాసంలో దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీపాలు వెలిగించడం పవిత్రత, ఆధ్యాత్మిక శక్తి, మరియు జీవితంలో ఆధ్యాత్మిక వెలుగును తీసుకురావడంలో సహాయపడుతుందని నమ్మకం.
పాపరహితం మరియు పుణ్యం:
కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించడం వలన చేసిన పాపాలు క్షమించబడతాయని, పుణ్య ఫలాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
శాంతి మరియు సౌభాగ్యం:
365 వత్తుల దీపారాధన మనసుకు ప్రశాంతతనూ, ఇంటికి సౌభాగ్యాన్నీ అందిస్తుందని నమ్మకం.
విద్యుద్దీపంగా వివరణ:
దీపాలు ఆధ్యాత్మిక స్ఫూర్తికి చిహ్నం. 365 వత్తులు ఒకే చోట వెలిగించడం సూర్యుని ప్రతీకగా భావించబడుతుంది. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానానికి మార్గం చూపుతుంది.
ఒక వేళ ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరలేని వాళ్ళు సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి తిథులలో దీపం పెడతారు. అదిఈ సాధ్యపడని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని తీసుకుని వెలిగిస్తారు. సంవత్సరానికి 365 రోజుల లెక్కన ఒక్కో రోజుకు ఒక్కో దీపం లెక్క అలా వెలిగిస్తారు. దీపం వెలిగించే ముందు ఈ శ్లోకం పఠిస్తారు.
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి మిరాపహా
భక్త్యా దీపం ప్రయాచ్చామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాంనర కాద్ఘోరా ద్ధివ్యజ్యోతిర్నమోస్తుతే
దీపం ప్రాముఖ్యతను ఈ శ్లోకం చెబుతుంది. మూడు వత్తులను తీసుకుని నూనెలో తడిపి అగ్నిని జతచేసి ముల్లోకాల చీకట్లను పోగొట్టగలిగే దివ్య జ్యోతిని వెలిగిస్తూ దేవుడికి భక్తితో సమర్పిస్తున్నాను అని దీని అర్థం. లోకానికి వెలుగును ఇచ్చేది దీపం. అటువంటి దీపాన్ని మనస్పూర్తిగా దేవుడిని తలుచుకుంటూ వెలిగించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పని సరిగా 365 వత్తులు ఉన్న దీపం వెలిగిస్తారు. గుడికి వెళ్ళి వెలిగించలేని వాళ్ళు ఇంట్లోని తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు.
కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి రుద్రాభిషేకం చేయిస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఈరోజు చాలా మంది కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తారు. మరికొందరు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఇది చేయడం వల్ల సకల సంపదలు సొంతం అవుతాయి. శివకేశవులకు ప్రీతికరమైన ఈరోజు దీపం వెలిగించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు దీప దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు జరిగే మరొక అద్భుతమైన ఘట్టం జ్వాలా తోరణం. సాయంత్రం వేళ శివాలయాల దగ్గర జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు. శివపార్వతుల పల్లకిని ఈ జ్వాలా తోరణం కింద మూడు సార్లు అటూ ఇటూ తిప్పుతారు. దీన్ని దాటిన వారికి యమలోక శిక్షలు తప్పుతాయని భక్తుల విశ్వాసం.