మలయాళ నటుడు టోవినో థామస్ క్రేజ్ మలయాళ ప్రేక్షకుల మధ్య అత్యధికంగా పెరుగుతోంది. ఆయన్ని తెలుగులో కూడా ఓటీటీ ద్వారా అభిమానించే వారెందరో ఉన్నారు. తాజాగా ఆయన నటించిన ‘ARM’ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలై అక్కడ మంచి విజయం సాధించి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. జితిన్ లాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ సస్పెన్స్, యాక్షన్, ఎమోషన్ కలిపిన అన్వేషణతో నిండి ఉంటుంది. మరి ఈ సినిమా కథ హరిపురం అనే గ్రామంలో ఆవిష్కృతమవుతుంది. గ్రామం అడవులకు సమీపంలో ఉండి, ఎడక్కల్ రాజవంశీకులు పరిపాలిస్తున్న ప్రాంతం. ఒక రాత్రి, ఆకాశం నుండి గ్రామంలో కాంతిపుంజం చేరుతుందీ దాని నుంచి ఒక విలక్షణ పదార్థం ఉద్భవిస్తుంది. ఎడక్కల్ సంస్థానాధీశుడు ఆ పదార్థాన్ని తీసుకుని ఒక ప్రత్యేక విగ్రహాన్ని తయారు చేయిస్తాడు, దీనికి ‘విభూతి దీపం’ అనే పేరు పెట్టి, ఆలయంలో ప్రతిష్టిస్తాడు. ఈ విగ్రహం గ్రామస్థులకు పవిత్రమైనదిగా, అత్యంత విలువైనదిగా భావించబడుతుంది. ఏడాదికి ఒకసారి ఆలయం తెరచుకొని ఉత్సవాలు నిర్వహిస్తారు.
కానీ, అజయ్ (టోవినో థామస్) కుటుంబం ఆ ఆలయానికి దూరంగా ఉంటుంది. అజయ్ తాత కుంజికేలు, తండ్రి మణియన్ దొంగలుగా ముద్ర పడటంతో గ్రామస్థులు అజయ్ ను కూడా అనుమానితుడిగా చూస్తారు. అజయ్ తో సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి లక్ష్మి మాత్రమే, ఆమె గ్రామ పెద్ద అయిన నంబియార్ కూతురు. సరిగ్గా ఉత్సవాల సీజన్‌లో నంబియార్ ఇంటికి సుధీర్ అనే వ్యక్తి వస్తాడు. సుధీర్ ఆ విగ్రహాన్ని లండన్‌కు తరలించాలనుకుంటాడు, ఇదే అతని అసలు ప్లాన్. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఆలయంలోని విగ్రహం మాయమవుతుంది, అందరి అనుమానం అజయ్ మీద పడుతుంది. అజయ్ నిర్దోషి అని నిరూపించుకోవడమే కాకుండా, తన కుటుంబ సభ్యులకు ఆలయ ప్రవేశం కల్పించడం, లక్ష్మిని తన జీవిత భాగస్వామిగా మార్చుకోవడం అతని లక్ష్యంగా మారుతుంది. వీటిని సాధించడానికి అజయ్ ఎలాంటి కఠిన ప్రయత్నాలు చేస్తాడన్నది కథలోని ప్రధాన ఆసక్తి.
‘ARM’ సినిమా మైథలాజికల్ టచ్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్. సుజిత్ నంబియార్ రాసిన ఈ కథలో మూడు తరాల కథానాయకుడిగా టోవినో కనిపిస్తాడు. తన తాత, తండ్రి, మనవడిగా టోవినో మూడు పాత్రలను పోషించడంలో ఆయన ప్రతిభను ప్రదర్శించాడు. కథా ప్రక్రియ మూడు తరాల కథనంతో సాగుతుంది. ఈ మూడు కాలాల సమ్మేళనం మేజికల్‌గా ఉండేలా స్క్రీన్‌ప్లేలో మార్పులు చేయడం వల్ల ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతుంది. స్క్రీన్ ప్లే క్రమం మలుపుల మధ్య ప్రేక్షకుల దృష్టిని గందరగోళం చేయకుండా కట్టిపడేసే విధంగా సాగుతుంది. కథలో మూడు తరాలలోని విగ్రహానికి సంబంధించిన అన్వేషణ అందరిలో కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. క్లైమాక్స్ సమయానికి, అసలు విగ్రహం ఎక్కడుందనే విషయాన్ని బయటపెడుతుంది. అజయ్ తీసుకునే నిర్ణయాలు, అనుభవాలు కథను కొత్త మలుపు వైపు నడిపిస్తాయి.
టోవినో మూడు పాత్రల్లోనూ విభిన్నంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ప్రతి పాత్రను తనదైన శైలిలో ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యాడు. హీరోయిన్‌గా కృతి శెట్టి పాత్ర పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా, అందంగా కనిపిస్తుంది. హరీష్ ఉత్తమన్ యంగ్ విలన్ పాత్రలో, సంతోష్ గ్రామ పెద్ద పాత్రలో బాగా ఒదిగిపోయారు. జోమన్ జాన్ ఫోటోగ్రఫీ హైలైట్ అని చెప్పాలి. అడవులు, గుహలు, జలపాతాలను చూపించిన తీరు విజువల్‌గా గొప్ప అనుభవాన్ని అందిస్తుంది.