రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు అనంతరం ఇటీవల అమ్రపాలి రాష్ట్రానికి వచ్చి రిపోర్టు చేశారు. అయితే ఇంతకుముందు తెలంగాణలోనే కొనసాగించాలని ఆమ్రపాలితో పాటు పలువురు ఐఏఎస్ ల బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ వీరి వాదనలను న్యాయమూర్తులు తోసిపుచ్చడం గమనార్హం.
ఆమ్రపాలి విశాఖపట్నం లో పుట్టిన వ్యక్తి, ప్రాథమిక విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. ఆమె తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రురాలిగా మరియు IIM బెంగళూరు నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 2010 UPSC పరీక్షల్లో 39వ ర్యాంక్ సాధించడం ద్వారా ఐఏఎస్‌కు ఎంపికై యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమె సోషల్ మీడియా వేదికగా పలు సలహాలు ఇచ్చి యువతకు ప్రేరణగా నిలిచారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ కమిషనర్ సహా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఆమ్రపాలి తన నూతన బాధ్యతల్లో పర్యాటక శాఖలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టనున్నారు. పర్యాటక శాఖ ఉద్యోగులు ఆమెను ఘనంగా స్వాగతించారు, ఈ సమయంలో ఆమె అందరి సహకారాన్ని కోరుతూ, తమ సహకారాన్ని ప్రతి ఒక్కరికీ అందిస్తానని వెల్లడించారు.