హైదరాబాద్: రాష్ట్రానికి విచ్చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి 6 గ్యారంటీలకు సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని… ఆయనకు దమ్ముంటే ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ యాత్ర చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాకే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు.
హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి మరీ యువతకు రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు. వాటిని అమలు చేయకుండా ఈ రోజు తెలంగాణకు వస్తున్నారని… అందుకే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ నేతలు అయినా… ఈ దేశంలో తిరిగే హక్కు ఉందని… కానీ హామీలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా రాహుల్ గాంధీపై ఉందన్నారు.
నా పాదయాత్రలో మూసీ వద్దకు వెళ్లిన. విషం కక్కుతున్న నీళ్లను కళ్లారా చూసిన. ఆ విషపు నీటి కోరల్లో చిక్కుకుని యాదాద్రి జిల్లా ప్రజలు ఏ విధంగా విలవిల్లాడుతున్నారో.. సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగు నీటి కోసం నీళ్లు కొనుక్కొని, వాటర్ ప్లాంట్ ద్వారా తెచ్చుకునేందుకు ఏ విధంగా బాధలు పడుతున్నరో చూసిన. మూసీని ప్రక్షాళన చేయాలని బీజేపీ మొదటి నుండి కోరుతోంది. కానీ ఆ పేరుతో పేదల ఇండ్లను కూల్చొద్దన్నదే మా డిమాండ్. అట్లాగే మూసీని అడ్డుపెట్టుకుని లక్షన్నర కోట్ల దోపిడీని ఆపాలన్నదే మా డిమాండ్. 15 వేల కోట్లతో ఖర్చయ్యే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లకు పెంచి కమీషన్లు దండుకోవడానికి మేం వ్యతిరేకం. తెలంగాణ నిండా అప్పుల్లో మునిగిపోయింది. బీఆర్ఎస్ చేసిన అప్పులను తీర్చేందుకు గంటకు 3 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తోందని మీ మంత్రులే మొత్తుకుంటున్నరు. ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది జీతాలకే ఇబ్బందిగా ఉందని చెబుతున్నరు. అట్లాంటప్పుడు మళ్లీ లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి జనంపై రుద్దడం ఎంత వరకు కరెక్ట్? కాంగ్రెస్ అగ్రనేత కుటుంబానికి కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజల జీవితాలను ఫణంగా పెడతారా? కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుంటే.. మీరు లక్షన్నర కోట్లు దోచిపెట్టడానికి మూసీని వాడుకుంటారా? అని ప్రశ్నించారు.