అమరావతి: ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నవంబర్ 1వ తేదీ శుక్రవారం నుంచి అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఇది ఒక ముఖ్యమైన భాగం.
కాగా, శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సందర్శించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభిస్తారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే చేశారు.
ఇకపోతే.. ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అర్హులైన ప్రజలకు ఉచిత గ్యాస్ అందించబడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం-2 పథకానికి అనుగుణంగా ఉచిత సిలిండర్లు అందించబడనున్నాయి. ప్రతి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పేదలపై గ్యాస్ భారాన్ని తగ్గించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ఉచిత సిలిండర్లను నాలుగు నెలల వ్యవధిలో ఒకటి చొప్పున పంపిణీ చేయనున్నది.