ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అర్థవంతమైన పండుగగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలతో జరుపుకోవాలని సూచించారు. దీపం చైతన్యానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి ప్రతీకగా ఉంటుందని, దీపావళి దీపాల వెలుగుతో ప్రపంచాన్ని తేజోవంతం చేస్తుందని పవన్ పేర్కొన్నారు.
దీపావళి సంబరాల్లో భాగమైన బాణసంచా నయనానందకరంగా ఉంటుందని, అయితే వీటిని జాగ్రత్తగా వాడాలని సూచించారు. కొద్దిపాటి అజాగ్రత్త కారణంగా దీపావళి సంతోషం విషాదానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం బాణసంచా ప్రమాదాలతో గాయపడే వారిని ఆసుపత్రిలో చూసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే పెద్దలు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఈ పండుగ అందరికీ ఆనందం, ఆరోగ్యం, సంతోషాలను అందించాలని ఆకాంక్షిస్తూ పవన్ కల్యాణ్ తన శుభాకాంక్షలను తెలిపారు.